CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన అధ్యయనం జరగలేదని, మహారాష్ట్రలో ముంపు సమస్యను ఆ ప్రాజెక్టు పరిష్కరించలేదని పేర్కొంది. అంతేకాకుండా,వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం,ప్రాణహిత అనే రెండు వేర్వేరు ప్రాజెక్టులుగా రీడిజైన్ చేసిందని, ఈ రీడిజైన్ అంచనా వ్యయం 35,000 కోట్ల నుండి 85,650 కోట్లకు గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడింది. అయితే, ప్రాజెక్టుల వ్యయం 122 శాతం పెరిగినప్పటికీ, నిధుల కేటాయింపు మాత్రం 52 శాతం మాత్రమే పెరిగిందని కాగ్ పేర్కొంది.
అనేక రకాల అవకతవకలు
రీ-ఇంజనీరింగ్ తర్వాత కూడా ప్రాజెక్టులో అదనపు మార్పులు చేశారని,ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా 47,427 కోట్లకు పెరిగిందని నివేదిక హైలైట్ చేసింది. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరుపయోగంగా మారాయని,ఫలితంగా రూ.767.78 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లిందని నివేదికలో కాగ్ వెల్లడించింది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ప్రాజెక్టు కి సంభందించిన వార్షిక ఖర్చులు తక్కువ చూపారని,కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని,ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది. రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుందని,బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది.