LOADING...
Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కలు తరచూ రోడ్లపై అడ్డుపడుతూ వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్,జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల సమన్వయంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవి ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించగా వ్యక్తమయ్యాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, వీధి కుక్క కరుస్తుందని భావించినప్పుడు స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు.

వివరాలు 

వీధుల్లో, స్కూల్స్, విద్యా సంస్థల పరిసరాల్లో కుక్కలు ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్న 

అటువంటి సందర్భంలో అధికారులు ఆ కుక్కను స్టెరిలైజ్ చేసి వదిలివేస్తారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, "స్టెరిలైజ్ చేసిన తర్వాత కూడా కుక్కలకు కౌన్సిలింగ్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మనుషులను కరవడం మాత్రమే కాకుండా, వీధిలో కుక్కలు పరిగెత్తడం వలన వాహన ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉంది" అని పేర్కొంది. ప్రమాదం జరిగిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. వీధులు, స్కూళ్లు, విద్యాసంస్థల చుట్టుపక్కల కుక్కలు సంచరించాల్సిన అవసరం ఏమిటో కూడా ధర్మాసనం ప్రశ్నించింది. వీధుల్లో సంచరించే ప్రతీ కుక్క మనుషులను కరవకపోవచ్చు కానీ రోడ్లపై అవి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం మాత్రం ఉందని ధర్మాసనం పేర్కొంది.

Advertisement