కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదాలు అంతర్జాతీయ నాయకులకే కాకుండా సామాన్యులకు కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య విబేధాల ప్రభావం వాణిజ్యంపై పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడా నుంచి భారత్ భారీస్థాయిలో కాయ ధాన్యాలు, పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటుంది. ఈ వివాదం తర్వాత పప్పు దినుసుల దిగుమతిని భారత్ భారీగా తగ్గించినట్లు రెండు దేశాల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పప్పు ధరలు పెరిగే అవకాశం
భారత్ విక్రయాలను తగ్గించడం వల్ల కెనడియన్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దిగుమతులను తగ్గించడం వల్ల భారత్‌లో పప్పు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ కొరత వల్ల దేశంలో పప్పు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ పప్పు ధరలు పెరిగితే, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రభుత్వాలు వాణిజ్య ఆంక్షలు విధించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే భారత్‌కు ఆంక్షలను విధించే ఆలోచన లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో కెనడా నుంచి పెరిగిన పప్పు దిగుమతులు
గతేడాది కెనడా నుంచి 370 మిలియన్ డాలర్లు (రూ. 3,079 కోట్లు) విలువైన 485,492 మెట్రిక్ టన్నుల కాయధాన్యాలను భారతదేశం దిగుమతి చేసుకుంది. భారతదేశం మొత్తం దిగుమతుల్లో సగానికి పైగా కెనడా వాటా ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 420శాతం పెరిగి 190,784 టన్నులకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. భారతదేశం మొత్తం పప్పు వినియోగం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 1.6 మిలియన్ మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన మొత్తంగా ఇతర దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. అందులో మెజార్టీ వాటా కెనడా నుంచే కావడం గమనార్హం.