Loading...
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై పట్టు వీడని అభ్యర్థులు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై పట్టు వీడని అభ్యర్థులు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం

Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై పట్టు వీడని అభ్యర్థులు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు జరిపింది. అయితే ఈ సమావేశాలతోనూ ప్రతిష్ఠంభనకు తెరపడలేదు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తొలుత జార్ఖండ్ లోక్ జనశక్తి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలోని నిరసనకారుల వర్గంతో సమావేశమైంది. పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ మహతో చేపట్టిన నిరాహార దీక్ష శనివారానికి ఏడో రోజుకు చేరుకుంది.

వివరాలు

డిమాండ్లు న్యాయమైనవి

ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్‌ఎస్‌యూఐ (NSUI), ఆదివాసీ ఛాత్ర సంఘ్, జార్ఖండ్ ఛాత్ర మోర్చా ప్రతినిధులతో ప్రభుత్వ కమిటీ వేర్వేరుగా చర్చలు జరిపింది.

అంతకుముందు శుక్రవారం రాత్రి కూడా 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందంతో ప్రభుత్వం చర్చలు నిర్వహించింది.

వరుసగా జరిగిన సమావేశాల అనంతరం ప్రభుత్వ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నిరసనకారులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు.

వారి డిమాండ్లను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

వివరాలు

14వ JPSC పరీక్ష రద్దు చేయాలి

అధికార జేఎంఎం విద్యార్థి విభాగమైన జార్ఖండ్ ఛాత్ర మోర్చా (JCM) ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఉంచింది.

వీటిలో 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది.

మరోవైపు కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న NSUI ప్రభుత్వం ముందు ఆరు డిమాండ్లను ఉంచింది.

అనుమానాస్పదంగా ఉన్న అన్ని JPSC, JSSC పరీక్షలపై 90 రోజుల్లోపు సీఐడీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.

అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరింది.

ADVERTISEMENT

వివరాలు

గిరిజన, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆదివాసీ ఛాత్ర సంఘ్ నేత కార్తిక్ ఓరావ్ మాట్లాడుతూ.. నియామక పరీక్షల్లో గిరిజన, ప్రాంతీయ భాషలను క్వాలిఫైయింగ్ పేపర్లుగా చేర్చాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు.

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పరీక్షలను రద్దు చేయాలని కూడా కోరినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ ఐదుగురు సభ్యుల కమిటీ తొలుత దేవేంద్రనాథ్ మహతో వర్గానికి చెందిన విద్యార్థుల సంఘంతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమైంది.

తమ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆ ఫోరం నేత తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఆందోళనలను విరమించేందుకు నిరసనకారులు

అయితే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ తమ ఆందోళనలను విరమించేందుకు నిరసనకారులు సిద్ధంగా లేరు.

14వ JPSC పరీక్షను రద్దు చేయడంతో పాటు తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

దీంతో జార్ఖండ్‌లో నియామక పరీక్షల వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది.

ADVERTISEMENT