Bengaluru: వాషింగ్ మెషీన్‌లో చిన్నారులు.. బెంగళూరు డేకేర్‌పై తీవ్ర ఆరోపణలు.. ఐదుగురు కేర్‌టేకర్లపై పోలీసు కేసు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్‌లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రెండు నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులను ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో వారి నోటిలోకి నీరు కొట్టడం,బాత్రూమ్‌లలో బంధించడం వంటి దారుణాలకు పాల్పడ్డారని సమాచారం. ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని హెచ్‌ఏఎల్ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న డేకేర్ సెంటర్‌లో పనిచేస్తున్న ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలు ఏడ్చినా లేదా అల్లరి చేసినా వారిని భయపెట్టేందుకు వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నోటిలోకి నీరు కొట్టడం, బాత్రూమ్‌లో బంధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.
వివరాలు
డేకేర్ కేంద్రాల భద్రత, పర్యవేక్షణపై ప్రశ్నలు
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. క్యాప్‌జెమినిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమ పిల్లలను భద్రతగా ఉంటారనే నమ్మకంతో ఈ డేకేర్‌లో చేర్పించగా, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ ఘటనతో కార్పొరేట్ క్యాంపస్‌లలో నిర్వహిస్తున్న డేకేర్ కేంద్రాల భద్రత, పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. వైరల్ వీడియోల్లో చిన్నారులు ఏడ్చినా లేదా అల్లరి చేసినా కేర్‌టేకర్లు వారిని బెదిరిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.
వివరాలు
చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు
పిల్లలను ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో వారి నోటిలోకి నీరు కొట్టడం, బాత్రూమ్‌లలో బంధించడం, నిశ్శబ్దంగా ఉండాలని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు, సంబంధిత కేర్‌టేకర్లను విచారణ కోసం త్వరలో పిలవనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేధింపులను చూపిస్తున్నట్లుగా భావిస్తున్న వీడియోలు వాట్సాప్‌లో వైరల్ కావడంతో చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందింది. అనంతరం సోమవారం ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అందిన ఫిర్యాదు ఆధారంగా జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టంలోని పలు నిబంధనల కింద ఐదుగురు మహిళలపై కేసు నమోదు చేశారు.
వివరాలు
గతంలో కూడా చిన్నారులపై వేధింపులకు సంబంధించిన ఘటనలు
వైట్‌ఫీల్డ్ డివిజన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సైదులు అద్వత్ కేసు నమోదైన విషయాన్ని ధ్రువీకరించారు. దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై క్యాప్‌జెమిని ప్రతినిధి స్పందిస్తూ.. విషయం సంస్థ పరిశీలనలో ఉందని, సమగ్రంగా సమీక్షించిన అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. గతంలో కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో డేకేర్ కేంద్రాల్లో చిన్నారులపై వేధింపులకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.