Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లోని ముస్లిముల పరిస్థితితో పోలిస్తే, భారత ముస్లిములు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారని కిరణ్ రిజిజు తెలిపారు. భారతదేశం తన మైనార్టీల హక్కులను రక్షించడంలో ముందు ఉందని, పొరుగు దేశాల నుంచి మైనార్టీలు ఆశ్రయం కోరుతున్న విషయం దీని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మైనార్టీలకు భారత రాజ్యాంగం అందజేస్తున్న న్యాయ రక్షణ విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు
ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లో మైనార్టీలకు ఓటింగ్ హక్కులు కూడా లభించడంలేదని ఆయన అన్నారు. అయితే భారతదేశంలో మైనార్టీలు తమ హక్కులను కాపాడుకునేందుకు సంపూర్ణ రక్షణ పొందుతున్నారని తెలిపారు. దేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కిరణ్ రిజిజు సూచించారు. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య రంగంలో భారత్‌తో ఏ ఇతర దేశాన్ని కూడా పోల్చకూడదని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మార్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.