Maha Kumbh:మహా కుంభ్‌పై 'తప్పుదోవ పట్టించే' కంటెంట్ వ్యాప్తి.. 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది.
45 రోజుల పాటు కొనసాగుతున్న ఈ మహాసభలో ఇప్పటికే 60 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.
అయితే, మహాకుంభంపై తప్పుదారి పట్టించే సమాచారం (Misleading Content) సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
మహాకుంభంపై దుష్ప్రచారం చేసిన 140 సోషల్ మీడియా ఖాతాలపై (Social Media Handles) కేసులు నమోదు చేసినట్లు మహాకుంభ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ ప్రకటించారు.
అలాగే, సంబంధిత ఖాతాదారులపై 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
మహాశివరాత్రి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇక మహాకుంభమేళా ముగింపు వేడుకగా ఫిబ్రవరి 26న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు.
ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహాకుంభ్ ప్రాంతంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎంత మంది యాత్రికులు వచ్చినా పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వివరాలు
మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళా
గత జనవరి 13న పౌష్ పూర్ణిమ సందర్భంగా ఈ మహాకుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఈ మహోత్సవం ముగియనుంది. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు.
పవిత్ర గంగ, యమున, సరస్వతి నదులు కలిసి ఏర్పడిన త్రివేణీ సంగమం (Triveni Sangam)లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఇక మరో రెండు రోజుల్లో ఈ మహోత్సవం ఘనంగా ముగియనుంది.