
Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు మే 6న కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని మంగళంపేట ప్రాంతంలో ఉన్న అటవీ భూమిలో అక్రమంగా ప్రవేశించి, ఆ భూభాగాన్ని ఆక్రమించడమే కాకుండా అక్కడి జీవవైవిధ్యానికి హాని కలిగించినట్టు ప్రాథమిక నేర నివేదికలో (PFR) స్పష్టం చేశారు.
ఈ కేసులో నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ పేర్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయిలతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది.
వివరాలు
27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమణ
కమిటీ చేసిన విచారణలో పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు తేలింది.
ఇంకా, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ బోర్లను ఏర్పాటు చేశారని, ఈ ఆక్రమణల వల్ల సుమారుగా రూ. కోటి విలువ చేసే జీవవైవిధ్య నష్టం సంభవించిందని అధికారులు స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు హద్దురాళ్లను నాటిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకొంతకాలంలో పూర్తి కానుంది.
వివరాలు
అధికారులపై విచారణ
ఇతర క్రిమినల్ అంశాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో పాకాల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు, ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి.
ఈ అక్రమాలను ప్రోత్సహించిన లేదా సహకరించిన అధికారులపై విచారణ జరుగుతోందని అవసరమైతే వారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.