ఏపీ పాలిటిక్స్ : చిక్కుల్లో పవన్ కల్యాణ్.. జనసేనానిపై పలు కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విజయవాడ అయోధ్య నగర్‌కు చెందిన వాలంటీర్ ఫిర్యాదుతో కృష్ణలంక ఠాణాలో 153, 153ఎ, 502(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏలూరు సభలో వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ అనుచితంగా మాట్లాడారంటూ రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పవన్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలిగిన నేపథ్యంలో ఆయా సెక్షన్లు ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చారు. జనాల్ని అదుపు చేసేందుకే వాలంటీర్ వ్యవస్థను తెచ్చారని, వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్ ఎందుకు వెళ్తోందన్నారు.
వాలంటీర్లలో కొందరు దుర్మార్గులకు ఒంటరి మహిళలే లక్ష్యం : పవన్ కళ్యాణ్
వాలంటీర్లు తనకు సోదర సమానులని, వారి పొట్ట కొట్టాలని తాను అనుకోనన్న పవన్ చెప్పారు. జనసేన అధికారంలోకి వచ్చాక ఇప్పుడిస్తున్న రూ.5 వేలకు అదనంగా మరో 5 వేలు ఇస్తామన్నారు. వాలంటీర్లలో కొందరు దుర్మార్గులున్నారని, వారికి ఒంటరి మహిళలే లక్ష్యమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లొంగనివారికి పథకాలు తీసేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ల దెబ్బకు జనం గద్ద కాళ్ల కింద కోడిపిల్లలా అల్లాడిపోతున్నారని జనసేనాని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు వాలంటీర్ల సేవా సైన్యం పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదలైంది. అందులో భాగంగానే జనసేనానికి 10 ప్రశ్నలను సంధించారు.