ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో అధికార పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీని వీడినట్లు ప్రకటించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీని వీడి వెళ్లడం తనకు వేదన మిగిల్చిందని ఆందోళన వెలిబుచ్చారు. 2009లో ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసిన రమేశ్ బాబు, పెందుర్తి నుంచి పీఆర్పీ తరఫున బరిలోకి దిగి విజయదుందుభి మోగించారు.
2020లో వైసీపీ కండవా కప్పుకున్న రమేశ్ బాబు
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఈ మేరకు రమేశ్ హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ తీరును నిరసిస్తూ విడ్కోలు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ గా విడిపోయాక 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలిచి నిలబడ్డారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 2020లో రమేశ్, వైసీపీ కండువా కప్పుకున్నారు. చివరకు 2024 ఎన్నికల ముంగిట తాజాగా ఆ పార్టీని సైతం వీడటం గమనార్హం.