Megha Engineering: మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థపై కేసు నమోదు చేసి సీబీఐ
తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎన్ ఐ ఎస్‌పీ(నిస్ప్)ప్రాజెక్టులో 315 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్‌ఎండీసీ ఐరన్ స్టీల్ ప్లాంట్,మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన ఎనిమిది అధికారులపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చర్యలు చేపట్టింది. ఎన్‌ఎండీసీ సంస్థకు సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్(నిస్ప్)మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఐదేళ్ల పాటు మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ కు కాంట్రాక్టు ఇచ్చింది. దీంతోపాటు క్రాస్ కంట్రీ పైప్ లైన్,నిస్ప్ ప్రాజెక్టు ఇంటేక్ వెల్ అండ్ పంప్ హౌస్ పనుల్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది.
వివిధ సెక్షన్ల క్రింద సీబీఐ కేసులు నమోదు
అయితే మేఘా సంస్థ తమకు ఈ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఆయా సంస్థలకు భారీగా డబ్బులు ముట్టజెప్పారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూ/ఎస్ 120 బీ ఐపీసీ, ఆర్/డబ్ల్యూ ఐపీసీ 465, సెక్షన్ 78 అండ్ 9 కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులు నమోదు చేసింది. రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల పేర్లతో విరాళాలు అందించిన వివరాలు తప్పనిసరిగా వెల్లడి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ మేఘా పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.