సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటకలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా పనిచేస్తున్న ప్రవీణ్ సూద్, పదవీ కాలం మేతో ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో రెండేళ్ల పాటు ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునితో కూడిన కమిటీ సీబీఐ చీఫ్‌ని ఎంపిక చేస్తుంది.
ప్రవీణ్ సూద్ గురించిన మరికొన్ని వివరాలు
1964లో దిల్లీలో జన్మించిన ప్రవీణ్ సూద్ దిల్లీ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1986లో ఐపీఎస్‌లో చేరిన చేరిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూర్‌లో ఏసీపీగా విధుల్లో చేరారు. బెంగళూరులో డీసీపీగా పదోన్నతి పొందే ముందు బళ్లారి. రాయచూర్ ఎస్పీగా పనిచేశారు. 2004-2007 మధ్య మూడేళ్లపాటు మైసూర్ సీపీగా పనిచేశారు. ప్రవీణ్ సూద్ ముఖ్యమంత్రి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ విశిష్ట సేవ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1999లో మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా పనిచేశారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్‌లో అదనపు పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేశారు.