అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు. విమానాశ్రయాల్లో ముందస్తు అనుభవం లేని వారు ఎయిర్ పోర్టుల అభివృద్ధిలో పాల్గొనకూడదనే నియమం ఉందని, అదానీ కోసం ఈ నియమాన్ని ప్రభుత్వం మార్చిందన్నారు. అనంతరం అదానీకి ఆరు విమానాశ్రయాలు కట్టబట్టారన్నారు. ఈడీ, సీబీఐని పంపి జీవీకే ఆధీనంలో ఉన్న ముంబయి ఎయిర్‌పోర్టును ప్రభుత్వం అదానీ వశం చేసిందని దుయ్య బట్టారు.
8 బిలియన్ల డాలర్లు నుంచి 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరుకున్నారు: రాహుల్
అదానీ నికర విలువ 2014లో 8 బిలియన్ల డాలర్లు ఉంటే, 2022 నాటికి 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరుకుందని యువత తమను అడుగుతున్నారని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లగానే ఎస్‌బీఐ అదానీకి ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ఇస్తుందన్నారు. అనంతరం మోదీ బంగ్లాదేశ్ వెళితే, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్‌కు సంబంధించిన 25సంవత్సరాల కాంట్రాక్ట్ అదానీకి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రధాని మోదీకి అదానీ ఎంత డబ్బు ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. మోదీజీ.. అదానీతో కలిసి (విదేశీ పర్యటనలు) ఎన్నిసార్లు విమానాల్లో ప్రయాణించారని రాహుల్ అడిగారు. గత 20ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ముట్ట జెప్పారని ప్రశ్నించారు.