అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని తాను రెండేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నట్లు రాహుల్ అన్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేశంలోని మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని ఆరోపించారు. అదానీ గ్రూప్ వెనుక ఉన్న శక్తులు ఎవరో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం భయపడి దీనిపై చర్చను కోరుకోవడం లేదన్నారు. అదానీపై ఎలాంటి చర్చలు జరగకుండా మోదీజీ అన్ని ప్రయత్నాలు చేస్తారని రాహుల్ గాంధీ చెప్పారు.
అదానీ గ్రూపుపై చర్చకు విపక్షాల పట్టు
అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. అదానీపై మోసంపై విచారణ జరపాలని విపక్షాలు పట్టు పడుతుంటే, అధికార బీజేపీ మాత్రం ససేమీరా అంటోంది. దీంతో ఉభయ సభల్లో సోమవారం కూడా రగ రాజుకుంది. అదానీ గ్రూపుపై విచారణ చేప్టటాలని విపక్షాలు ఆందోళన చేపట్టగా సోమవారం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్ దాదాపు 103 బిలియన్ డాలర్లను కోల్పోయింది.