అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ ఏర్పడింది. అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్ల విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో భారతీయ ఇన్వెస్టర్ల నష్టాలపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలు పార్లమెంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. ఈక్రమంలో సభను స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్
మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. ఈక్రమంలో సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో దాన్ని కూడా ఛైర్మన్ ధన్‌ఖ్‌డ్ రేపు ఉదయం 11గంటలకు వాయిదా వేశారు. గౌతమ్ అదాని, హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎల్ఐసీ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టిను ప్రజలు నష్టపోతున్నట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 14న ముగుస్తుంది. రెండో విడత మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 6న వరకు కొనసాగుతుంది. సెషన్‌లో దాదాపు 36 బిల్లులను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.