'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం యాత్ర ఖాంజీగుడ్‌కు చేరుకోగానే జన సందోహం భారీగా రావడంతో వారిని నియంత్రించలేక జమ్ము కశ్మీర్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు రాహుల్ యాత్రను ఆపేశారు. శనివారం యాత్ర మళ్లీ మొదలైంది. జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించాలని లేఖలో షాను ఖర్గే కోరారు.
భారత్ జోడో యాత్రలో మెహబూబా ముఫ్తీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం అవంతిపోరాలోని చెర్సూ గ్రామం నుంచి ప్రారంభమైంది. అవంతిపోరాలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ యాత్రలో పాల్గొని, రాహుల్‌తో కలిసి నడిచారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ నాయకుడు గులాం అహ్మద్ స్పందించారు. శుక్రవారం వేలాది మంది యాత్రలో చేరేందుకు వచ్చారని, భద్రతా లోపం స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాత్రకు విశేష ఆదరణ లభించిందన్నారు గులాం అహ్మద్. యాత్ర లక్ష్యం చాలా విశేషమైనదన్నారు. 13 రాష్ట్రాల్లో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. యాత్ర అజెండా రాజకీయాలకు అతీతం అన్నారు.