'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూలో సాగోతోంది. ఈ సందర్భంగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని సోమవారం దిగ్విజయ్ సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలాడుతోందని ఆరోపించారు.
భారత జవాన్లను మేము విశ్వసిస్తాం: రాహుల్ గాంధీ
సర్జికల్ స్ట్రైక్స్ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో వర్కింగ్ కమిటీలోనే చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత జవాన్లను తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జమ్మూలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఎప్పుడూ దేశం కోసమే పని చేస్తామని, సైన్యం పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది.