'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన
గౌతమ్ అదానీపై ప్రముఖ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పార్లమెంట్‌ను కూడా కుదిపేస్తోంది. నివేదికపై నిజానిజాలను తేల్చాలని డిమాండ్ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 6న తేదీన ప్రతి జిల్లాలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. భారత ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రధానమంత్రి తన ఆశ్రిత మిత్రులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వేణుగోపాల్ ఆరోపించారు. ఆలా చేయడం వల్లే నేడు ప్రధాన ప్రభుత్వ సంస్థలు ప్రమాదంలోకి నెట్టబడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ.36వేల కోట్లు, బ్యాంకులు రూ.80,000 కోట్ల పెట్టుబడి
హిండెన్‌బర్గ్ నివేదిక ధాటికి భారత స్టాక్ మార్కెట్ షేక్ అవుతోంది. ముఖ్యంగా అదానీ కంపెనీ షేర్లు అయితే గత కొన్ని రోజులుగా లోయర్ సర్క్యూట్‌ను తాకుతూ, ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ.36,474.78 కోట్లు పెట్టుబడి పెట్టగా, భారతీయ బ్యాంకులు దాదాపు రూ.80,000 కోట్లు గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేశాయని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం, ఇతర అవకతవకల ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వ సంస్థలు తమ వాటాలను అలాగే కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ దాదాపు 100 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు.