
Telangana: తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
సుమారు ఏడాదిన్నర పాటు చేసిన కృషికి ఫలితంగా గోదావరి జలాలను వినియోగించుకునేందుకు భారీ అవకాశాలు ఏర్పడినట్లు మంత్రి తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు గోదావరి నీటి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.
తాజాగా సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల నీరు విడుదలయ్యే అవకాశముండటంతో, సుమారు 8 లక్షల ఎకరాల భూమికి సాగునీటి లాభం చేకూరనుంది.
ఈ అనుమతులు తెలంగాణ జలవనరుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Details
ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి నిధులు కోరాం
గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన నేపథ్యంలో, సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే అన్ని సాంకేతిక వివరాలు సమర్పించిన తరువాతే సీడబ్ల్యూసీ (CWC) అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో సంభవించబోయే ముంపును నివారించేందుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్ర నిధులను కోరినట్లు ఉత్తమ్ చెప్పారు.
దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. కృష్ణా జలాల పంపకంలో గత ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేసిందని, న్యాయం కోసం ట్రిబ్యునల్స్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదిస్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
Details
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అవినీతి
అంతరాష్ట్ర సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా పని చేస్తోందని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, నాణ్యత లోపాలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఎత్తిచూపారు. ''వాళ్లే కట్టారు.. వాళ్ల హయాంలోనే కూలిపోయింది'' అంటూ ధ్వజమెత్తారు.
మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం వంటి ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు NDSA నివేదికలో బయటపడ్డాయని ప్రజలు గుర్తించాలన్నారు.
లక్ష కోట్ల రూపాయల అవినీతిపై దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తుచేశారు.
NDSA నివేదికలో వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రజలకు మేల్కొలుపు కావాలని పిలుపునిచ్చారు.