K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎయిర్ పోర్ట్‌లలో 'ఎకనామిక్ జోన్లు' ఏర్పాటు చేసి, ఇక్కడ తక్కువ ధరలకు ఆహార పదార్థాలు, శీతల పానీయాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్ పోర్టులో వస్తువుల ధరపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అన్ని ఎయిర్ పోర్ట్‌లలో ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
త్వరలో ఎకనామిక్ జోన్లు
ఈ జోన్లలో ఆహారం, పానీయాలు తక్కువ ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ జోన్లలో ప్రయాణికులు కూర్చుని ఆహారం తినే అవకాశం ఉండదని సమాచారం. ఇక్కడ ఆహారం కొనుగోలు చేసి తీసుకెళ్లే సౌలభ్యం మాత్రమే కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ జోన్ల ఏర్పాటుతో ప్రయాణికులకు ధరలభారం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ జోన్ల ఏర్పాటుకు సమయం పట్టే అవకాశముంది.