జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలకు అవకాశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జులై తొలివారంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సోమవారం మూడో తేదీన భేటీ నిర్వహించనున్నారు. దిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ హాలులో కేంద్రమంత్రి వర్గ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు సహాయ, స్వతంత్ర మంత్రులు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు గల అవకాశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి ఆశావహులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశం ముందు కేంద్ర కేబినెట్
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి మండలి భేటీ జరగడం పట్ల కేంద్ర వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సంవత్సరం చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కీలక రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు మిజోరాంలోనూ ఇప్పటికే ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్యూహాలపైనా చర్చించేందుకు అవకాశం ఉంది. ప్రధాని మోదీ నివాసంలో గత అర్థరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర కీలక నేతలతో కీలక చర్చలు జరగడం గమనార్హం.