Digital Tribal university: డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు
గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించి మరింత సమాచారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ యూనివర్శిటీ ద్వారా గిరిజనుల జీవన శైలీ, సంస్కృతి, ఆచార వ్యవహారాలు వంటి విషయాలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించడం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లోని గిరిజనుల ఆచారాల వ్యవహారాలకు సంబంధించి 25 సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువస్తారు. వచ్చే విద్యాసంవత్సరంలో డిజిటల్ విధానంలో ఈ కోర్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
నాలుగు సబ్జెక్టులపై ముసాయిదా సిద్ధం చేసిన తెలంగాణ
ఈ క్రమంలో గురువారం రాష్ట్రాలలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు అప్పగించిన సబ్జెక్టుల తయారీ పురోగతిని వారు సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అధికారులు ఇప్పటికే నాలుగు సబ్జెక్టులపై ముసాయిదా సిద్ధం చేశారు. వాటిలో ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన గుస్సాడి నృత్యం, తోటికీర్తి సంగీతం, ఢోలికోయా సంగీతం, నాయక్‌పోడ్ మాస్క్‌లు ఉన్నాయి.
ముసాయిదాపై సబ్జెక్టు నిపుణులు మార్పులు, చేర్పులు
మరిన్ని రాష్ట్రాల నుంచి మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, ఆహారం, మెడిసిన్, జీవన విధానం, ఆదివాసీ విజ్ఞానం, నృత్యం, నాటికలు, గిరిజన ఆరాధ్య దైవాలు వంటి అంశాలపై కూడా ముసాయిదాలు రూపొందిస్తున్నాయి. ఈ కోర్సులు డిజిటల్ విధానంలో ఉండి, వాటిని నేర్చుకునేందుకు వీడియో, ఆడియో పాఠాలు, టెక్స్ట్ మెటీరియల్ అందించబడుతుంది. రాష్ట్రాలు సిద్ధం చేసిన 25 సబ్జెక్టుల ముసాయిదాపై దిల్లీలోని సబ్జెక్టు నిపుణులు మార్పులు, చేర్పులు సూచించనున్నారు.