అమరావతి ఆర్5 జోన్ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్ 5 జోన్ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో జులై 8న గృహ నిర్మాణాలను ప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు గత మే 26న అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది.
సీఆర్డీఏ పరిధిలోని 50 వేల 793 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలను అందించారు.
మరోవైపు పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహరంపై రాజకీయ దుమారం రేగింది.
DETAILS
జులై 8న సదరు ఇళ్ల స్థలాల్లో నిర్మాణాల ప్రారంభోత్సవాలకు లైన్ క్లియర్
సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాల్లో 51,392 మందికి ఇళ్ల పట్టాలు అందాయి.
స్థలానికి సంబంధించి వివాదాలు కోర్టుల్లో ఉన్నాయని, ఇళ్ల మంజూరుపై ఆలోచించాలని గతంలోనే విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరాయి.
అయితే ఆయా లేఖలను పక్కన బెట్టిన కేంద్రం, తాజాగా సీఆర్‌డీఏ పరిధిలోని 47 వేలకుపైగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్రానికి సమాచారం పంపింది.
మరో 3 వేల ఇళ్లు పెండింగ్ ఉన్నాయని, త్వరలోనే అవి కూడా మంజూరు అవుతాయని ఏపీ ప్రభుత్వం ధీమాగా ఉంది. కేంద్రం నిర్ణయంతో జులై 8న సదరు ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.