Telangana: తెలంగాణలోని 31 జిల్లాలకు ఎగుమతి హబ్ హోదా.. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ జిల్లాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, అందించే ప్రత్యేక సేవలకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలను డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రపంచస్థాయి మార్కెట్లలో పోటీ పడే సామర్థ్యం ఉన్న స్థానిక ఉత్పత్తులు,సేవలను గుర్తించి.. వాటిని విదేశీ మార్కెట్లతో అనుసంధానించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. గతంలో అమలు చేసిన 'ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి' కార్యక్రమాన్ని మరింత విస్తరించేలా కేంద్రం డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ప్రత్యేకతను తీసుకొచ్చే ఉత్పత్తులు, సేవలను గుర్తించి వాటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు.
వివరాలు
31 జిల్లాలకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా విదేశీ మార్కెట్లకు అనుకూలంగా ఉండే ఉత్పత్తులు, సేవల వివరాలతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపింది.
తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించింది.
హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాలను డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ కార్యక్రమానికి ఎంపిక చేసింది.
ఆయా జిల్లాల్లో స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, సేవలను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
వివరాలు
బ్రాండింగ్, మార్కెటింగ్‌పై దృష్టి
ఎంపికైన జిల్లాల ఉత్పత్తులకు మెరుగైన బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ఆయా ఉత్పత్తులకు ఉన్న అవకాశాలను గుర్తించి ఎగుమతులను పెంచేలా అవసరమైన సహకారం అందించనున్నారు.
దీంతో జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులు దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా విదేశీ కొనుగోలుదారులకు చేరే అవకాశం లభించనుంది.
ఒకే వేదికపైకి అన్ని వర్గాలు
జిల్లాల వారీగా గుర్తించిన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేయనున్నారు.
సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు,ఎగుమతిదారులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు.
ఉత్పత్తుల అభివృద్ధి నుంచి మార్కెటింగ్, ఎగుమతుల వరకు అవసరమైన సహకారం అందేలా అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్ణయించారు.
వివరాలు
రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు
డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ కార్యక్రమం అమలును సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఎగుమతి ప్రోత్సాహక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. అదే విధంగా జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తారు.
కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు స్థానిక ఉత్పత్తులు, సేవల గుర్తింపు, అభివృద్ధి, మార్కెటింగ్, ఎగుమతులకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేయనున్నాయి.
వివరాలు
జిల్లాలు... ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు
భద్రాద్రి కొత్తగూడెం: స్పాంజ్ ఐరన్, అటవీ ఉత్పత్తులు, మిర్చి
ఆదిలాబాద్: డోక్రా కళోత్పత్తులు, సోయాబీన్, ఫర్నిచర్, పత్తి
హైదరాబాద్: రత్నాలు, ఆభరణాలు, ముత్యాలు
జయశంకర్ భూపాలపల్లి: మిరప, చెక్క కళాకృతులు
జోగులాంబ గద్వాల: చేనేత చీరలు కామారెడ్డి: కోడి మాంసం, ఆయిల్‌పామ్, కోడిగుడ్లు
జగిత్యాల: మామిడి, బియ్యం, పసుపు, బంగారు ఆభరణాలు
జనగామ: బియ్యం, ఇత్తడి కళాఖండాలు, పెంబర్తి లోహకళ
కరీంనగర్: బియ్యం, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, గ్రానైట్
ఖమ్మం: మామిడి, మిరప, గ్రానైట్, బొగ్గు
వివరాలు
జిల్లాలు... ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు
కుమురంభీం ఆసిఫాబాద్: పత్తి, చిరుధాన్యాలు
మహబూబాబాద్: మామిడి, పసుపు, మిరప
మంచిర్యాల: మామిడి, పత్తి
మహబూబ్‌నగర్: మామిడి, జొన్న, జనరల్ ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఖనిజాలు
మెదక్: టెక్స్‌టైల్స్, దుబ్బాక వస్త్రాలు, కోళ్ల దాణా
మేడ్చల్-మల్కాజిగిరి: బయోటెక్ ఉత్పత్తులు
ములుగు: మిర్చి పంట నారాయణపేట: చేనేత చీరలు, వస్త్రాలు
నిజామాబాద్: పసుపు, బియ్యం, విత్తనాలు, చక్కెర
పెద్దపల్లి: బయో ఫ్యూయల్, కలప ఫర్నిచర్
రంగారెడ్డి: మామిడి, బిస్కెట్లు, ఆహారశుద్ధి ఉత్పత్తులు
వివరాలు
జిల్లాలు... ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు
నాగర్‌కర్నూల్: మామిడి, వేరుశెనగ, రెడీమేడ్ వస్త్రాలు
నల్గొండ: పత్తి, బియ్యం నిర్మల్: పసుపు, నిర్మల్ బొమ్మలు, చిత్రాలు
రాజన్న సిరిసిల్ల: చేనేత, పవర్‌లూమ్ వస్త్రాలు
సంగారెడ్డి: మామిడి, జనరల్ ఇంజినీరింగ్ ఉత్పత్తులు, విత్తనాలు
వనపర్తి: మామిడి, వేరుసెనగ వరంగల్: చేనేత తివాచీలు, మొక్కజొన్న, మామిడి, బియ్యం, రెడీమేడ్ వస్త్రాలు
సిద్దిపేట: పత్తి, జిన్నింగ్
సూర్యాపేట: పండ్లు, సిమెంట్
వికారాబాద్: జరీ చీరలు, కందులు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు