Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని సమకూర్చడం కోసం కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదించబడింది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల ప్రధానిని మరొకసారి కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఉక్కుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
వివరాలు
నష్టాలను అధిగమించడానికి
దిల్లీ వెళ్లిన ప్రతిసారి, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవం గురించి చర్చలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల,ప్రధానిని మళ్లీ కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ విజ్ఞప్తి మీద విభిన్న కోణాల్లో చర్చలు జరిపి,కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీని ఆమోదించింది.
విశాఖ ఉక్కు కర్మాగారం ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్నా, 2023-24లో రూ. 4,848.86 కోట్ల నష్టాన్ని, 2022-23లో రూ. 2,858.74 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
వర్కింగ్ క్యాపిటల్ కోసం తీసుకున్న అప్పులు పెరిగిన కారణంగా ఈ నష్టాలు ఏర్పడ్డాయి.
వివరాలు
రెండు విడతల్లో సహాయం
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు, స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శించారు.
ప్లాంట్‌ను నిలబెట్టుకోవడానికి రూ. 18 వేల కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు.
అనంతరం, కొన్ని రోజుల తర్వాత, కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద రూ. 500 కోట్లు జీఎస్టీ చెల్లింపులకు, రూ. 1,150 కోట్లు బ్యాంకు అప్పుల చెల్లింపులకు రెండు విడతల్లో సహాయం చేసింది.
వివరాలు
సమగ్ర ప్రణాళికతో ముందుకు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకుల కొరత, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ వంటి సమస్యలు ఎదుర్కొంటోంది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ ప్రణాళికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్ స్థాయి సంఘం సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.
రివైవల్ ప్యాకేజీ కింద కేంద్రం ₹11,440 కోట్లను కేటాయించదని మంత్రి వెల్లడించారు.
ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్యాకేజీ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలను అధిగమించి, పూర్తి ఉత్పాదనకు చేరుకొని లాభాల బాటలో వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదే నిదర్శనమని చెప్పారు.