Page Loader
Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక
రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక

Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి నంబరును కూడా కేటాయించింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేసింది. ఈ పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయంగా కేంద్రం అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న 398.8 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి 544డిని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో మొత్తం పొడవులో 288.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తుండగా, మధ్యలో ఉన్న 110 కిలోమీటర్లను మాత్రం రెండు వరుసలుగా వదిలేశారు.

వివరాలు 

ప్రస్తుతం జరుగుతున్న పనులు 

దీనికి కేంద్రం సాంకేతిక కారణాలు చూపుతోంది. అయితే ఈ 110కిలోమీటర్లను కూడా నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తే, రాజధాని అమరావతి నుంచి రాయలసీమ ప్రాంతానికి సాఫీగా వెళ్లే ఒక శక్తివంతమైన రహదారి అందుబాటులోకి వస్తుంది. అనంతపురం నుంచి ముచ్చుకోట మీదుగా బుగ్గ వరకు 69కిలోమీటర్లను నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఈ పనులు రెండు ప్యాకేజీలుగా విభజించబడి, రూ.1,600కోట్ల వ్యయంతో జరుగుతున్నాయి. బుగ్గ నుంచి కైప మీదుగా గిద్దలూరు వరకు 135 కిలోమీటర్ల ప్రస్తుత రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా మార్చేందుకు రోడ్డు రవాణా శాఖ అనుబంధ కమిటీ ఇటీవల అంగీకారం తెలిపింది. ఇందులో 15 కిలోమీటర్ల రహదారి రక్షిత అటవీ ప్రాంతం మీదుగా వెళ్లనుండగా, దానికి కూడా విస్తరణకు క్లియరెన్స్‌ లభించింది.

వివరాలు 

ఆ భాగం మినహా.. 

ప్రస్తుతం డీపీఆర్ తయారీ జరుగుతుండగా, భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. గిద్దలూరు నుంచి వినుకొండ వరకు ఉన్న 110కిలోమీటర్ల రహదారిని 10మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించిన పనులు 2020లోనే పూర్తయ్యాయి. అప్పటి నుంచి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)టోల్ వసూలు చేస్తోంది. అయితే నాలుగు వరుసల విస్తరణపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న 84.8 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు మోర్త్‌ ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ అనుమతి ఇచ్చింది. దీనికై రూ.2,605 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే మూడు జిల్లాల్లో భూసేకరణ కోసం ల్యాండ్‌ ప్లాన్‌ సర్వే కూడా ప్రారంభమైంది. డీపీఆర్ సిద్ధం అవుతున్న దశలో ఉంది.

వివరాలు 

రాష్ట్ర ప్రభుత్వ చొరవ అవసరం 

అనంతపురం నుంచి గుంటూరు వరకు రహదారి మొత్తం నాలుగు వరుసలుగా ఉండాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ఒకప్పుడు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రూపంలో ఉన్న అనంతపురం-అమరావతి కల నెరవేరని సందర్భంలో,ఈ ప్రత్యామ్నాయ హైవేకు పూర్తి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రత్యేకించి మధ్యలో వదిలివేసిన 110 కిలోమీటర్లను కూడా విస్తరించేలా కృషి చేయాలి. కేంద్రం ఇప్పటికే బుగ్గ - గిద్దలూరు మధ్య అటవీ ప్రాంతాన్ని కూడా నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు అంగీకరించిన నేపథ్యంలో,గిద్దలూరు - వినుకొండ మధ్య భాగాన్ని కూడా అలాగే అభివృద్ధి చేయడం సాధ్యమే. కేంద్రం తరపున వాహన రద్దీ తక్కువగా ఉందని కారణంగా చూపినా,ఇరు వైపులా నాలుగు వరుసల హైవే ఉన్నందున రద్దీ పెరుగుతుందన్న వాదన బలంగా వినిపించవచ్చు.

వివరాలు 

శ్రీశైలానికి కీలక రహదారి 

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ఏడు ఉమ్మడి జిల్లాల భక్తులు ప్రముఖ శైవక్షేత్రం అయిన శ్రీశైలానికి వెళ్లేందుకు ఈ హైవేను ప్రధాన మార్గంగా వాడతారు. గుంటూరు, వినుకొండ, త్రిపురాంతకం మీదుగా కుంట వరకు ప్రయాణించి, అక్కడి నుంచి శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ 544డి హైవేను పూర్తిగా నాలుగు వరుసలుగా విస్తరిస్తే, భక్తుల రాకపోకలు మరింత మెరుగవడమే కాకుండా, వారిలో ఈ మార్గం మీద ప్రయాణించాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది.