Ashwini Vaishnaw: హైదరాబాద్ మెట్రోకు రుణ సాయం నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు ఆర్థిక సాయం అందించే అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రెండోదశ నిర్మాణం కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) రుణం ఇస్తామని చెప్పిన విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు రుణాలు, నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాలు కూడా అందజేశారు. రెండోదశ నిర్మాణానికి అవసరమైన అనుమతులు,ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఐఆర్‌ఎఫ్‌సీ నిధుల అంశంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు.
వివరాలు
వచ్చే ఏడాది మేలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్
ఇంతకుముందు ఈ అంశంపై చర్చలు జరిగినప్పటికీ.. సోమవారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఐఆర్‌ఎఫ్‌సీ ఆర్థిక సాయం గురించి తనకు తెలియదని రైల్వేశాఖ మంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ రైలును గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు చెప్పారు.
అహ్మదాబాద్-ముంబయి మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
సూరత్-బిలిమొరా మార్గంలో 50 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
ఇదే తరహాలో మిగిలిన సెక్షన్లలోనూ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
రైల్వేలో సంస్కరణలు.. రూ.1,078 కోట్ల అదనపు ఆదాయం
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బుల్లెట్ రైలు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 2029 నాటికి ఈ రైలు థానే వరకు చేరుకుంటుందని వెల్లడించారు.
రైల్వే సరకు రవాణా వ్యవస్థలో పలు మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
వీటి ద్వారా అదనంగా రూ.1,078 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
మరోవైపు ఈ ఏడాది ఇప్పటివరకు రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణాలు చేసినట్లు చెప్పారు.
1980 నుంచి కొనసాగుతున్న టికెట్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసినట్లు వివరించారు.