LOADING...
Bus safety norms: రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ
రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ

Bus safety norms: రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో రోడ్డు ప్రమాదాలు,వాటివల్ల జరుగుతున్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వాహనాల మధ్య పరస్పర సమాచార మార్పిడికి ఉపయోగపడే వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి వైర్‌లెస్ విధానంలో సమాచారం పంచుకుంటూ డ్రైవర్లను ముందుగానే హెచ్చరిస్తాయని ఆయన వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన 43వ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశం అనంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు.

వివరాలు 

బ్లైండ్ స్పాట్స్‌లో ఉన్న వాహనాల గురించి కూడా ముందుగానే తెలుసుకునే అవకాశం

ఈ టెక్నాలజీ అమలుకు టెలికాం శాఖ (DoT) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని,అవసరమైన స్పెక్ట్రమ్‌ను ఉచితంగా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని గడ్కరీ వెల్లడించారు. V2V కమ్యూనికేషన్ కోసం 5.875 నుంచి 5.905 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 30 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. వాహనాల్లో అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్ (OBU) ద్వారా సమీపంలో ఉన్న ఇతర వాహనాల వేగం,స్థానం, అకస్మాత్తుగా బ్రేక్ వేసిన సమాచారం వంటి కీలక వివరాలు డ్రైవర్‌కు వెంటనే అందుతాయి. దీని వల్ల బ్లైండ్ స్పాట్స్‌లో ఉన్న వాహనాల గురించి కూడా ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరికరం ధర సుమారు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉండొచ్చని అంచనా.

వివరాలు 

ఆరు బస్సు అగ్నిప్రమాదాల్లో 145 మంది మృతి 

ఈ ఏడాదిలోనే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవాణా శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ తెలిపారు. అదే సమావేశంలో స్లీపర్ బస్సుల తయారీలో జరుగుతున్న అక్రమాలపై నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో జరిగిన ఆరు బస్సు అగ్నిప్రమాదాల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. బస్సుల నిర్మాణంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వివిధ స్థాయిల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 1.8 లక్షల మంది మృతి 

ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థలు మాత్రమే తయారు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నడుస్తున్న బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ లైటింగ్, సురక్షిత ఎగ్జిట్ మార్గాలు వంటి భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, అందులో 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల లోపు యువతేనని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం 

2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం మోటారు వాహనాల చట్టంలో 61 సవరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, రోడ్డు ప్రమాద బాధితులకు ఏడు రోజుల పాటు రూ. 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ చికిత్స అందించే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు.

Advertisement