Loading...
Andhra Pradesh: పెట్టుబడిదారులకు భరోసా.. ప్రత్యేక రక్షణ చట్టాలు తెస్తాం: చంద్రబాబు
పెట్టుబడిదారులకు భరోసా.. ప్రత్యేక రక్షణ చట్టాలు తెస్తాం: చంద్రబాబు

Andhra Pradesh: పెట్టుబడిదారులకు భరోసా.. ప్రత్యేక రక్షణ చట్టాలు తెస్తాం: చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మారినా, రాజకీయ పరిస్థితులు మారినా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పెట్టుబడిదారుల్లో ఉన్న అనుమానాలను తొలగించి, వారికి పూర్తి భరోసా కల్పించడమే ఈ చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలోనూ ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే భారత్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించారు.

వివరాలు 

సహకరించేందుకు మా ప్రభుత్వం సిద్ధం: చంద్రబాబు 

గురువారం విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు.

గత రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, సాధించిన పురోగతిని ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను మరింత సరళీకరించామని చెప్పారు.

ఆటోమేటిక్ డీమ్డ్ అప్రూవల్, థర్డ్ పార్టీ ఎంప్యానెల్‌మెంట్ విధానాలకు ఇటీవలే అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.

పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తూ.. "మీరు ఎలాంటి వ్యాపారం చేయాలనుకున్నా, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా సహకరించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

మీ దేశాల్లోని మంచి పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ గురించి వివరించి,వారిని రాష్ట్రానికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చిన దౌత్యవేత్తలను కోరుతున్నాను.

వివరాలు 

రూ.30లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

మీ పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తాం. పెట్టుబడికి తగిన ప్రతిఫలం వచ్చేలా చూస్తాం. దేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం" అని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏడాది క్రితం సూచించారని చంద్రబాబు గుర్తుచేశారు.

తాను ఆ పని చేయలేనని అనుకున్నారని, కానీ చేసి చూపించామని అన్నారు.

రాష్ట్రానికి రూ.30లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.

ప్రస్తుత సదస్సులో కుదరనున్న రూ.9.89లక్షల కోట్ల ఒప్పందాలను కలిపితే మొత్తం పెట్టుబడుల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

ఆరు నెలల్లో 160 గిగావాట్ల లక్ష్యాన్ని దాటుతాం

దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తోందని చంద్రబాబు తెలిపారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్రం 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

ఇందులో 160 గిగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. మరో ఆరు నెలల్లో ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఏడాదికి రూ.4.22 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

దక్షిణాసియాలోనే తొలి ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్‌ను ఫిబ్రవరి 3న అమరావతిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏడేళ్లలో రాత్రిపూట కూడా సూర్యకాంతి అందించే సాంకేతికత

రాబోయే రెండు, మూడేళ్లలో అమరావతిలోనే 3,000 క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేస్తామని తెలిపారు.

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో అంతరిక్షం నుంచి లేజర్ సాంకేతికత ద్వారా భూమికి విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు తెలిపారు.

అంతరిక్షంలో సూర్యకాంతిని ఉపయోగించి భూమిపై ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే ఏడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.

రాత్రి సమయాల్లోనూ సూర్యకాంతిని అందించే సాంకేతికత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు చేయనున్న స్పేస్ సిటీ ఇలాంటి వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

త్వరలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీలు

రక్షణ రంగానికి అవసరమైన డ్రోన్లలో అత్యధిక శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

విశాఖపట్నంలో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని తొలుత భావించామని, ఇప్పటికే 4.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఆహార శుద్ధి రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

రెండేళ్లలో 12 రెట్లు పెరిగిన పెట్టుబడుల వేగం

2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.2.47 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు సాధించే వేగం అప్పటితో పోలిస్తే 12 రెట్లు పెరిగిందన్నారు.

2024 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకున్నట్లు వివరించారు. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 526 ప్రాజెక్టులు అమలు దశకు చేరుకున్నాయని చెప్పారు. మొత్తం పెట్టుబడి ఒప్పందాల్లో 76 శాతం కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు. ఇంతటి అధిక కన్వర్షన్ రేటును మరే రాష్ట్రం, దేశం సాధించలేదని వ్యాఖ్యానించారు.

వివరాలు 

రెండేళ్లలో 12 రెట్లు పెరిగిన పెట్టుబడుల వేగం

మరోవైపు రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. సదస్సుకు హాజరైన ప్రతి పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారుడు ప్రభుత్వంతో కనీసం ఒక ఎంఓయూ అయినా చేసుకోవాలని కోరారు. వాటికి సంబంధించిన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు 

మా వేగాన్ని ఎవరూ అందుకోలేరు

గతంలో ప్రైవేటు రంగంలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

శంషాబాద్‌లో తొలి విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 32 సమావేశాల అనంతరం ఎంతో కష్టపడి అనుమతులు ఇచ్చిందన్నారు.

ప్రస్తుతం ఆ విమానాశ్రయం ద్వారా జీఎస్‌డీపీలో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని చెప్పారు. ఒక పెట్టుబడిదారుడు ఎంతటి సంపదను సృష్టించగలడో ఈ ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చన్నారు.

అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు నీటి వసతి ఎలా కల్పిస్తారని సంస్థ ప్రతినిధులు ప్రశ్నించారని తెలిపారు.

అయితే కేవలం ఎనిమిది నెలల్లోనే శ్రీశైలం కాలువ నుంచి నీటిని తీసుకొచ్చి,రిజర్వాయర్ నిర్మించి సంస్థకు అందించామని చెప్పారు. ఒకప్పుడు కరవుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతంలో ఇప్పుడు కొరియన్ సిటీ ఏర్పడిందని వివరించారు.

వివరాలు 

మా వేగాన్ని ఎవరూ అందుకోలేరు

పుట్టపర్తిలో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ప్రతిపాదన దశ నుంచి భూమిపూజ వరకు కేవలం 36 రోజుల్లో పూర్తి చేశామని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ.3 లక్షల కోట్ల టర్నోవర్ సాధ్యమవుతుందని, రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు.

గత రెండేళ్లలో రాష్ట్రంలో 42 గిగావాట్ల సెల్ తయారీ సామర్థ్యం, 53 గిగావాట్ల ఇంగాట్, సోలార్ వేఫర్ తయారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

అవసరమైతే అణు విద్యుత్ ప్రాజెక్టులు

భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌర, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

అవసరాన్ని బట్టి అణు విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయలసీమ నుంచి వివిధ పోర్టుల వరకు ప్రత్యేక విద్యుత్ పంపిణీ కారిడార్‌ను నిర్మిస్తామని వెల్లడించారు.

ఎల్‌జీ సంస్థకు చెందిన ప్రాజెక్టును కేవలం 19 నెలల్లోనే పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇంత వేగంగా పూర్తయినది ఇదేనని సదరు సంస్థ ప్రశంసించినట్లు చెప్పారు.

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ను 2028 ఆగస్టు 15న ప్రారంభిస్తామని ప్రకటించారు.

వివరాలు 

అమరావతిలో స్థలం కొనుక్కోండి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం 1.5 గిగావాట్లు మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్‌లోనే ఇప్పటికే 4.6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు అనుమతులు ఇచ్చామని వివరించారు.

అమరావతిని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన, నివాసానికి అత్యంత అనుకూలమైన బ్లూ-గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు అమరావతిలో స్థలం కొనుగోలు చేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

తమ సంస్థలకు రెండో ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

వివరాలు 

ప్రపంచ డిజైన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటర్లు, అంతరిక్ష పరిశోధనలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సహా మొత్తం 25 రంగాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రత్యేక పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

తిరుపతి సమీపంలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి డిజైన్ కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పారు.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ డిజైన్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

ఈ శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా కంటే భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని చంద్రబాబు అంచనా వేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వివరాలు 

సీఎస్‌ఆర్‌లో భాగంగా పీ4లో భాగస్వాములవ్వండి

సమాజంలోని సంపన్నులు పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చి, వారిని అభివృద్ధి బాటలో నడిపించేలా పీ4 విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

తన నియోజకవర్గంలో టీవీఎస్ సంస్థ ఒక మహిళకు ఇటుకల తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించిందని ఉదాహరణగా చెప్పారు.

ఆ సహాయంతో యూనిట్ ఏర్పాటు చేసుకున్న ఆ మహిళ ప్రస్తుతం మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల ద్వారా ఇలాంటి మరిన్ని కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

వచ్చే ఏడాది అరకు తీసుకెళ్తాం

ఇది 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు అని చంద్రబాబు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ కలిపి ఇప్పటివరకు ఎనిమిది సదస్సులకు ఆతిథ్యమిచ్చే అవకాశం తనకు లభించిందన్నారు.

ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు అరకు కాఫీ రుచి చూసి ఉంటారని చెప్పారు. వచ్చే ఏడాది సదస్సుకు హాజరయ్యే వారిని అరకు తీసుకెళ్తామని ప్రకటించారు.

అక్కడ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేసి, ఆదివాసీల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేస్తామని వెల్లడించారు.

ADVERTISEMENT