LOADING...
Chandrababu: కుప్పానికి తొలిసారిగా చేరిన హంద్రీ-నీవా కృష్ణా జలాలు.. చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు
చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu: కుప్పానికి తొలిసారిగా చేరిన హంద్రీ-నీవా కృష్ణా జలాలు.. చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల స్వప్నం సాకారమైంది. ఎప్పటినుంచో కరవు నేలగా పేరుపొందిన ఈ ప్రాంతానికి తొలిసారిగా హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నదీ జలాలు చేరుకోవడంతో నియోజకవర్గమంతా ఉత్సాహభరితంగా మారింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పానికి వచ్చి ప్రజల ఆనందోత్సవాల్లో భాగమయ్యారు. శనివారం కుప్పం చేరుకున్న ఆయన,నియోజకవర్గంలోని చివరి భూభాగాలకు నీరందించే పరమసముద్రం చెరువు వద్ద నిర్వహించిన భారీ ప్రజాసభలో పాల్గొన్నారు. అంతకుముందు, కృష్ణా జలాలతో నిండిన చెరువులో స్థానికుల అభ్యర్థన మేరకు బోటు యాత్ర చేసి పరిస్థితిని పరిశీలించారు. బోటు ప్రయాణం సందర్భంగా ఒడ్డున చేరుకున్న ప్రజలకు అభివాదం కూడా తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

వివరాలు 

సుమారు 3,200 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం 

హంద్రీ-నీవా ద్వారా వచ్చిన ఈ జలాలతో కుప్పం నియోజకవర్గంలోని 66 చెరువులు నిండనున్నాయి. దాంతో కలిపి సుమారు 3,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.ఇప్పటికే గత మూడు నాలుగు రోజులుగా కాల్వల ద్వారా కృష్ణమ్మ ప్రవహిస్తుండటంతో రైతులు,గ్రామస్తులు ఆనందభాష్పాలతో ఉప్పొంగుతున్నారు. నీటిలో తడుస్తూ, కృష్ణా జలాలకు ఘన స్వాగతం పలుకుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు గత ప్రభుత్వం డమ్మీ గేట్లు పెట్టి మోసం చేసిందని గుర్తుచేసుకున్నారు. సభా ప్రాంగణంలో 1989 నుంచి కుప్పంలో సాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో సాధించిన అభివృద్ధిని వివరించే ప్రత్యేక వీడియోను అధికారులు ప్రదర్శించారు. కుప్పం నీటి సమస్యలు ఎలా పరిష్కారమయ్యాయో ఆ వీడియోలో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనతో పట్టణమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరమసముద్రం చెరువు కృష్ణాజలాల్లో బోటులో తిరుగుతున్న సీఎం చంద్రబాబు