Page Loader
Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు 
'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు

Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతికి ప్రపంచ బ్యాంక్‌ ద్వారా నిధులు సమకూర్చడమే కాక, పోలవరం మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకార ముద్ర వేసింది. విభజన హామీల్లో మరో కీలక అంశమైన రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డిసెంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో రైల్వే జోన్‌ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ విషయాన్ని ఎన్డీయే కూటమి ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు.

Details

ఏపీ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై చర్చించడానికి సోమవారం సాయంత్రం దిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడు, వెంటనే ప్రధానిని కలిశారు. ఈ సమావేశంలో చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో వరదల కారణంగా కలిగిన నష్టాలను సరిదిద్దడానికి కేంద్రం సహాయం వంటి కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం ప్రకటించిన 'వికసిత భారత్‌-2047' విజన్‌కు అనుసరంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి 'ఆంధ్రా-2047' అనే ప్రత్యేక విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తున్నట్లు ప్రధానికి వివరించారు.

Details

కేంద్రం సహకారం అవసరం

2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం కేంద్రం సహకారం అవసరమని కోరారు. ఇటీవల జరిగిన వరదలతో రాష్ట్రం ఎదుర్కొన్న కష్టాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి చేపట్టిన కీలక ప్రాజెక్టులు, ముఖ్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కూడా ప్రధానితో చర్చ జరిగింది. ప్రధానితో సమావేశం అనంతరం, చంద్రబాబు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు.

Details

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల మంజూరు, విశాఖ-అమరావతి రైల్వే లైన్‌ మంజూరును ప్రాధాన్యతగా చర్చించారు. ఇక రాష్ట్రంలో ఐటీ, సెమీకండక్టర్‌ పరిశ్రమల అభివృద్ధి కోసం అనుకూల వాతావరణం కల్పించి, యువతకు అధునాతన నైపుణ్యాలు అందించే అవకాశాలను పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం-అమరావతి మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం, కోస్తా తీరం వెంబడి రైల్వే కనెక్షన్‌ మెరుగుదల, హైస్పీడ్‌ రైలు కారిడార్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు.