చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.
తనను అంతం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన భద్రత, ఆరోగ్యంపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ నెల 25న రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు.
తాను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారన్న తెలుగుదేశం అధినేత, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారన్నారు.
తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని, ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు లేఖ కూడా వచ్చిందన్నారు.
details
నాతో పాటు నా కుటుంబీకుల భద్రతకు తీవ్ర ముప్పు : చంద్రబాబు
అయితే ఇప్పటికీ ఆ లేఖపై పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టలేదన్నారు. కొంతమంది ఖైదీలతోనూ తన భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జైళ్ల శాఖల్లో, ఖైదీల బ్యారక్ లల్లో అనేక దారుణాలు జరుగుతున్నాయన్నారు. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారని, తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారన్నారు.
ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారు ఉన్నారన్న బాబు, కొందరు ఖైదీల కారణంగా తన సెక్యూరిటీకి ముప్పు పొంచి ఉందన్నారు.
మరోవైపు ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా ఎవరో డ్రోన్ ఎగురవేశారని, ఇదే క్రమంలో ములాఖత్‌లో భాగంగా తనను కలిసిన కుటుంబీకుల ఫోటోలను సైతం డ్రోన్ సాయంతో చిత్రీకరించారన్నారు.