చంద్రబాబుకు కాస్త ఉపశమనం.. ఇకపై రోజుకు 2సార్లు లీగల్ ములాఖత్ లు, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రోజుకు రెండు ములాఖత్ లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ క్లయింట్ చంద్రబాబుకు ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కేసులున్న దృష్ట్యా నేపథ్యంలో ఆయనను న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖత్ లు శాంక్షన్ చేయాలని అభ్యర్థించారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో బాబు లాయర్లు పేర్కొన్నారు.
గతంలో 2 సార్లను ఒక్కసారికే కుదించారన్న న్యాయవాదులు
గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని, భద్రతా కారణాలతో ప్రస్తుతం దీన్ని రోజుకు ఒక్కసారికే కుదించారని కోర్టుకు తెలిపారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయననారు.లీగల్ ములాఖత్ సంఖ్య పెంపుపై చంద్రబాబు లాయర్ల పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారించింది. ఇదే సమయంలో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తొలుత తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే మరోసారి కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు లాయర్లు. దీంతో రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 21 తేదీ శనివారం, రేపట్నుంచే చంద్రబాబుకు రెండు ములాఖత్ లను అమలు చేయనున్నారు.