Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. తొలిసారిగా..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే దర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందించారు. ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్'లో అడుగుపెట్టారు. ఈ మేరకు తిరుమల శ్రీవారిని దర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై, బెయిల్ మీద బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుపతి పర్యటనలో ఉన్నారు. అనంతరం అమరావతికి వెళ్లనున్నారు.
సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ సమావేశం
ఇదే సమయంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకేందుకు ఎదురుచూస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం జరగనున్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అధ్యక్షత వహిస్తారు. మరోవైపు డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా వైఎస్సాఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, టీడీపీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ఇక శనివారం చంద్రబాబు విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించనున్నారు.