Page Loader
Chandra babu: 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ప్రకటన
2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ప్రకటన

Chandra babu: 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం దిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నుండి ''టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047'' పేరుతో రూపొందించిన టాస్క్‌ఫోర్స్ నివేదికను స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన దార్శనిక పథకాన్ని సిద్ధం చేయడం కోసం గత సంవత్సరం సెప్టెంబర్‌లో చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేసుకున్నారు.

వివరాలు 

356 పేజీలతో నివేదిక

ఆ బృందంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ,అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి,భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు ఎండీ సుచిత్ర ఎల్ల,రెడ్డీస్ ల్యాబ్స్ ఛైర్మన్ సతీష్ రెడ్డి,కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ రెడ్డి,జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎం రావు,ఎల్‌అండ్‌టీ సీఎండీ సుబ్రహ్మణ్యన్,టీవీఎస్ మోటార్స్ ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌లతో కూడిన సభ్యులు ఉన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ 356 పేజీలతో రూపొందించిన రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించారు.

వివరాలు 

ఏడాది కాలంలో రాష్ట్రం రూ.10లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది 

''మేం చాలా ఆశాజనకమైన ముందుచూపుతో వెళ్తున్నాం. ప్రస్తుతం 180బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 3,400డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 42,000డాలర్లకు పెంచాలని చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ఎగుమతులను 450 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనుకుంటున్నాం'' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతే కాకుండా,ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 2025 నుంచి 2029 మధ్యకాలంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తుందన్న అంచనాల విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఒక్క ఏడాది కాలంలో రాష్ట్రం రూ.10లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగిందని తెలిపారు. ఈ పెట్టుబడి ప్రాజెక్టులన్నీ పూర్తైతే దాదాపు 8.5లక్షల ఉద్యోగాలు కల్పించగలమని వివరించారు.

వివరాలు 

కుటుంబానికో ఆంత్రప్రెన్యూర్

25 ఏళ్ల క్రితం "కుటుంబానికో ఐటీ ప్రొఫెషనల్" అనే నినాదంతో పనిచేశామని, దాంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అత్యధిక తలసరి ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్పూర్తితో "కుటుంబానికో ఆంత్రప్రెన్యూర్" అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వ్యాపారవేత్తలకు అన్నివిధాలా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రతీ సిఫారసును అమలు చేస్తామని స్పష్టం చేశారు.

వివరాలు 

పారిశ్రామికవేత్తలు సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు

''వాణిజ్యవేత్తల ఉద్దేశ్యం సంపదను సృష్టించడమే. రాజకీయ నాయకుల బాధ్యత ప్రజలకు సాధికారత కల్పించడమే. కానీ కొందరు నాయకులు పారిశ్రామికవేత్తలను వారి వ్యక్తిగత లాభాల కోసం పని చేసేవారిగా అభిప్రాయపడుతున్నారు. అది పూర్తిగా తప్పు. మీరు సంపద సృష్టి ద్వారా ఉద్యోగాలను కల్పిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే పారిశ్రామిక, రాజకీయ వ్యవస్థలు కలిసి పనిచేయాలి'' అని ముఖ్యమంత్రి వివరించారు.

వివరాలు 

రాబోయే 25 ఏళ్లు భారతదేశానికి ఎంతో కీలకం

''రాబోయే 25 ఏళ్లు మనకు ఎంతో కీలకం. భారతదేశం, భారతీయులను ప్రపంచం నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి రాబోతోంది. అందువల్ల ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికల ప్రకారం ముందడుగు వేయాలి. ప్రతి పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని నేను కోరుతున్నాను'' అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.