Chandrababu: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరువురి మధ్య ఐక్యత అవసరమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లులాంటివి
ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివన్నారు., తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించాలన్న కృతనిశ్చయంతో తాను వున్నానని చంద్రబాబు తన ప్రసంగంలో తెలిపారు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల అంకితభావాన్ని కొనియాడిన అయన, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే నష్టాలే వస్తాయని,వాటి అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ఎంత ముఖ్యమో చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం పరస్పర సహకారం,పరస్పర వినిమయ వైఖరిని అలవర్చుకోవాలని ఆయన కోరారు. కరణం,మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్టీఆర్ తొలగించారని గుర్తుచేశారు. ఆ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేయడంతో మాకు స్వాతంత్ర్యం వచ్చిందని ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని చెప్పారు.
విభజన కంటే , వైసీపీతో జరిగిన నష్టమే ఎక్కువ
2019 ఎన్నికల తర్వాత ఏపీలో ఎదురయ్యే సవాళ్లను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. విభజన కంటే వైసీపీ హయాంలో జరిగిన నష్టమే ఎక్కువ. ఏపీలో నాలెడ్జ్ ఎకానమీ ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు. తెలుగు ప్రజలు ప్రపంచ నాయకులుగా ఎదగడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ అభివృద్ధి చెందిన భారతదేశంలో తెలుగు జాతి ముందుంటుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. 2047నాటికి భారతదేశం నంబర్ వన్ దేశంగా మారుతుందని ధీమాగా చెప్పారు. ఈ విజయంలో తెలుగువారు ముందంజలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని,ఏ ప్రాంతంవైపు మొగ్గుచూపబోనని తాను చెప్పానన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు.
పలువురు ప్రముఖు నేతల హాజరు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.