Chennai: భారీ వర్షాల కారణంగా చెన్నై అప్రమత్తం.. విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు వంటి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి, ముఖ్య రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈనెల 18 వరకు వర్క్ ఫ్రం హోమ్
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో, సీఎం స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నేడు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని,చెన్నై,తిరువళ్లూరు,కాంచీపురం,చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఇక మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో, ఉద్యోగులకు ఈనెల 18 వరకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించాల్సిందిగా సీఎం ఎంకే స్టాలిన్ ఐటీ సంస్థలకు సూచించారు. అక్టోబర్ 12 నుంచి 16మధ్య తమిళనాడు,పుదుచ్చేరి,కరైకల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 14వ తేదీ నుంచి 15వతేదీ వరకూ అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.