తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు
తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. సుమారు 40 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ వరుస దాడులు చేపట్టింది. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌కి కన్వేయర్ బెల్ట్‌లు, సంబంధిత పరికరాల సరఫరాలో పాల్గొన్న వివిధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులం కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని తొరైపాక్కం, పల్లికర్నై, నీలంగరై, నవలూర్, ఓఎంఆర్, ఎన్నూర్ తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రిపై మనీలాండరింగ్ ఆరోపణలు
తమిళనాడులో ఐటీ సోదాలు ఈ మధ్యకాలంలో తరుచూ జరగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పన్ను ఎగవేత ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఆ తర్వాత మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై బుధవారం జరగనుంది. మంత్రి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఎన్ఆర్ ఎలాంగోలు వాదిస్తున్నారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్ వాదిస్తున్నారు.