Page Loader
Tamilnadu: ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి ఏసీ విశ్రాంతి గదుల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయం 
ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి ఏసీ విశ్రాంతి గదుల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయం

Tamilnadu: ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి ఏసీ విశ్రాంతి గదుల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది తమ విధి నిర్వహణలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండేలా నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఏసీ గదులు ఏర్పాటు చేయాలని మహానగర చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) యంత్రాంగం నిర్ణయించింది. మొదటి విడతగా ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు భావిస్తోంది. చెన్నై మహానగరంలో ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు తక్కువ సమయంలో సేవలు అందించేందుకు వీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ రంగంలో దాదాపు 10% మంది మహిళా కార్మికులుగా ఉన్నారని అంచనా.కానీ, వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్న ఆరోపణలు ఉన్నాయి. పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి తగిన వసతుల్లేవు.

వివరాలు 

మహానగర చెన్నై కార్పొరేషన్ చర్యలకు సిద్ధం 

ముఖ్యంగా అన్నాసాలై రెండో అవెన్యూ, ఖాదర్ నవాజ్‌ఖాన్ రోడ్, ఉత్తమర్ గాంధీ రోడ్, రాయపేట హై రోడ్ వంటి ప్రాంతాలు డెలివరీ సిబ్బందికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. వర్షాకాలం, ఎండాకాలంలో వీరి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత సున్నితంగా ఉండటంతో వీరికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మహానగర చెన్నై కార్పొరేషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

వివరాలు 

జీసీసీ కార్యాచరణ 

ఫుడ్,ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వీరికి తాగునీటి సౌకర్యం,స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్,శుభ్రమైన మరుగుదొడ్లు,ఏసీ గదులతో కూడిన 24 గంటల విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమైన రహదారుల వెంట వీటిని ఏర్పాటు చేసి,మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభించి,తరువాత దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ప్రాథమికంగా అన్నానగర్,నుంగంబాక్కం,రాయపేట,మైలాపూర్,త్యాగరాయనగర్ వంటి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

వివరాలు 

 మహిళా డెలివరీ సిబ్బంది ఎక్కువగా లబ్ధి 

వీటి ద్వారా ముఖ్యంగా మహిళా డెలివరీ సిబ్బంది ఎక్కువగా లబ్ధి పొందగలరని అంచనా. ఈ విధమైన ఏసీ విశ్రాంతి గదులు దుబాయ్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయనీ, చెన్నై నగరంలో కూడా ఈ తరహా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని జీసీసీ కమిషనర్ కుమరగురు భరన్ తన 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) పేజీలో వెల్లడించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, నగరంలో వేలాది మంది డెలివరీ సిబ్బంది లబ్ధిపొందుతారని ఆయన అన్నారు.