Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్ ఆదర్శం.. అమిత్ షా
మావోయిస్టు తీవ్రవాదం ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని, దీని నిరోధం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో అమిత్ షా అధ్యక్షతన ఈ చర్చలు జరిగాయి. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తన చివరి దశకు చేరుకుందని షా పేర్కొన్నారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టారని, 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందగా, 723 మంది లొంగిపోయారని ఆయన వెల్లడించారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత దృఢంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
శాంతి సాధించేందుకు కృషి
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను శాంతి సాధించేందుకు అన్ని రాష్ట్రాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ విజయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ మావోయిస్టుల లొంగడం రాష్ట్రం మొత్తం, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలకు అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమని షా తెలిపారు. గత పదేళ్లలో మోదీ సర్కార్ చేసిన కృషిని గురించి అమిత్ షా వివరించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకం
11,500 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించడం, 15,300 సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేయడం, 165 ఏకలవ్య పాఠశాలలు నిర్మించడం వంటి అభివృద్ధి చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో 16,400 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, ప్రస్తుతం ఈ సంఖ్య 7,700కు తగ్గిందని వెల్లడించారు. హింసాత్మక ఘటనల వల్ల పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70 శాతం తగ్గాయని, హింసాత్మక జిల్లాల సంఖ్య 96 నుంచి 42కు తగ్గిందన్నారు. ఇలాంటి సంఘటనలు నమోదయ్యే పోలీసు స్టేషన్ల సంఖ్య కూడా 465 నుంచి 171కు తగ్గిందని అమిత్ షా వెల్లడించారు. ఈ విజయానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే కీలకమని పేర్కొన్నారు.