
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు.
Details
జనాభా తగ్గుదలపై సీఎం ఆందోళన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతంలో జనాభా వృద్ధి శాతం తగ్గడం గమనార్హం. యువత సంఖ్యలో తగ్గుదలతో భవిష్యత్తులో వృద్ధులే ఎక్కువవుతారన్న గణాంకాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జనాభా పెంపుదల అవసరమైందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తారని సమాచారం. 'ఒక్కరు ముద్దు.. ఇద్దరు చాలు' అన్న నినాదాన్ని ముందుపెట్టి కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ముగ్గురయినా ఏమి కాదు, నలుగురయినా నష్టమేంటి? అనే దిశగా తమ వైఖరిని మారుస్తున్నాయి. పిల్లలను భారం కాకుండా, భవిష్యత్ ఆస్తిగా పరిగణించాలని ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది.
Details
చంద్రబాబు దినచర్య వివరాలు
ఈరోజు ఉదయం జనాభా దినోత్సవం కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారు. ఇక ఎల్లుండి (జులై 12) సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు చేసే ప్రకటనలు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.