
Literature Award: కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాలలో.. 'కబుర్ల దేవత'కు బాలసాహిత్య పురస్కారం
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో తెలుగు భాషకు సంబంధించిన రెండు ప్రధాన అవార్డులు తెలుగువారికే లభించాయి. ప్రముఖ రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' గ్రంథానికి బాలసాహిత్య పురస్కారం, రచయిత ప్రసాద్ సూరి రచించిన 'మైరావణ' గ్రంథానికి యువసాహిత్య పురస్కారం లభించాయి. ఈ ఏడాది సాహిత్య అకాడమీ 24 భాషలలో బాలసాహిత్య పురస్కారాలు, 23 భాషలలో సాహిత్య పురస్కారాలు ప్రకటించింది. బాలసాహిత్యం విభాగంలో విజేతగా నిలిచిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు ప్రాంతానికి చెందినవారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో ఆయనకు బాలసాహిత్యంపై ఆసక్తి కలిగింది.
వివరాలు
సహస్రావధాని మేడసాని మోహన్ గంగిశెట్టి శివకుమార్ సహాధ్యాయి
నాలుగో తరగతిలో చదువుకుంటున్న సమయంలో ఆయన తొలిసారి ఒక గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడ 'ఆలీబాబా 40 దొంగలు' అనే పుస్తకం చదివిన అనంతరం బాలల కథల పట్ల ఆయనకున్న మక్కువ మరింతగా పెరిగింది. అప్పటి నుంచే గ్రంథాలయాలకు ప్రతిరోజూ వెళ్లి కథలు చదవడం అలవాటైంది. తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా కుటుంబం గూడూరుకు మారింది. అక్కడ ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నారు. తర్వాత తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో తెలుగు భాషలో ఎంఏ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో బాలల కథలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. సహస్రావధాని మేడసాని మోహన్ ఈయన సహాధ్యాయి.
వివరాలు
చందమామ పత్రికలో 'యథారాజా తథాప్రజ' కథ
డాక్టర్ శివకుమార్ రచయితగా తన తొలి ప్రయత్నం 'దైవసహాయం' అనే కథతో ప్రారంభమైంది. ఆయన రచించిన 'కబుర్ల దేవత' కథ 1970లో బాలానందం పత్రికలో ప్రచురితమైంది. ఇదే కథాశయాన్ని కొనసాగిస్తూ ఆయన 2023లో కొత్తగా రచనలు చేశారు,వాటికే ఇప్పుడు బాలసాహిత్య పురస్కారం లభించింది. 1973లో 'యథారాజా తథాప్రజ' అనే కథ చందమామ పత్రికలో వెలువడింది. అనంతరం అదే పత్రికలో వందకుపైగా కథలు ప్రచురితమయ్యాయి. ఆయన 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 'పున్నమి' మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా సేవలందిస్తున్నారు.
వివరాలు
డాక్టర్ శివకుమార్ రచనలపై పరిశోధనలు చేసిన ఇద్దరు విద్యార్థులకు పీహెచ్‌డీలు
డాక్టర్ శివకుమార్ రచించిన 'కష్టనష్టాలు', 'అసూయ', 'మాటల్లో తేడా' వంటి కథలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాథమిక పాఠ్యాంశాలగా ఎంపిక చేసాయి. 2005లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందించింది. అంతేకాక, ఆయన రచనలపై పరిశోధనలు చేసిన ఇద్దరు విద్యార్థులు పీహెచ్‌డీలు పొందారు.