Page Loader
India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్
India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

వ్రాసిన వారు Stalin
Mar 12, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది. ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను తాము తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను సందర్శించినట్లే, భారత నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్తారని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడం సరికాదని జైశ్వాల్ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత అంతర్భాగమన్నారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

చైనా

అరుణాచల్‌ ప్రదేశ్‌ను మేము గుర్తించలేదు: చైనా

ప్రధాని మోదీ మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించి ప్రపంచంలోనే అతి పొడవైన జంట-లేన్ సెలా టన్నెల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రాజెక్టులను ప్రారంభించడంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదన్నారు. దానిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. జాంగ్నాన్ ప్రాంతం చైనా భూభాగమని, భారత్ సంబంధిత చర్యలు సరిహద్దు సమస్యను క్లిష్టతరం చేస్తాయని వాంగ్ అన్నారు.