Page Loader
Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ
విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు దిగింది. విమానాల రాకపోకలకు భవనాలు, చెట్లు ప్రధాన అడ్డంకిగా మారుతున్న కారణంగా, వాటిని తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఉన్న నిర్మాణాలు లేదా చెట్లు విమాన ప్రయాణ భద్రతకు ప్రమాదంగా మారుతున్నట్టు గుర్తిస్తే, వాటిని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు, సివిల్ ఏవియేషన్ అధికారులిచ్చే నోటీసు వచ్చిన తరువాత 60 రోజుల వ్యవధిలో, సంబంధిత భవన యజమానులు తమ భవనాల ఎత్తును తగ్గించాలి లేదా వాటిని పూర్తిగా కూల్చేయాలి. భవన యజమానులు నోటీసుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ సమాధానాన్ని అందించాల్సి ఉంటుంది.

వివరాలు 

జూన్ 12 అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దుర్మరణం 

కాగా, నోటీసు ఇచ్చిన తరువాత కూడా యజమానులు స్పందించకపోతే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు స్వయంగా వాటిని తొలగించే అధికారం కల్పించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మించిన భవనాలను, విమాన రాకపోకలకు ముప్పుగా భావించి తక్షణమే కూల్చే హక్కు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే సమీపంలోని ఓ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరే ప్రాణాలతో బయటపడగా, మిగతా వారంతా మరణించారు.

వివరాలు 

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి 

అలాగే హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికల్ విద్యార్థులూ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు బయల్దేరిన ఈ విమానం,టేకాఫ్ సమయంలోనే కూలిపోయింది. ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించే క్రమంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వీలైనంత త్వరగా ఛేదించేందుకు సంబంధిత శాఖలు ప్రయత్నిస్తున్నాయి.