Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. బీహార్ కూలీలతో పాటు ఉగ్రవాది హతం
మణిపూర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలున్నారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చారు. కక్చింగ్ జిల్లాలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలను కాల్చి చంపారు. మృతులు సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్‌గా గుర్తించారు. ఈ యువకులు గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన వారు. వారు కక్చింగ్‌లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ వారిని కాల్చి హతమార్చారు. కార్మికులపై దాడికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోపక్క మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్‌ఫామ్ వద్ద ఒక ఉగ్రవాదిని హతమార్చారు.
9:30 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం
మృతుడిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్‌తక్‌గా గుర్తించారు. అతను నిషేధిత PREPAK సంస్థ సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధుల వినియోగం గురించి పోలీసులకు సమాచారం అందిన తరువాత, 9:30 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎన్‌కౌంటర్‌లో ప్రియమ్‌ను కాల్చి, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. అతని వద్ద నుంచి మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల మాట్లాడుతూ, తన కుమారుడు మూడు నెలల క్రితం కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు ఇంటి నుండి వెళ్లిపోయాడని తెలిపింది. ప్రియమ్ హైస్కూల్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని ఆమె తెలిపింది.