
10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ చేశారన్న ఆరోపణలపై హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు డీబార్ చేయగా, ఆ వార్త విన్న అతని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
బాలుడు కమలాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ కేసులో అతని ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అధికారులు ఐదేళ్లపాటు డిబార్ చేశారు.
అతని ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. తాను హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ తీసుకున్నారని, ఎలాంటి తప్పు చేయకపోయినా డిబార్ చేశారని విద్యార్థి తండ్రి కోర్టుకు తెలిపారు.
తెలంగాణ
రాజకీయాల పేరుతో తన కుమారుడిని బలి చేయొద్దు: విద్యార్థి తండ్రి
తన కుమారుడిని పరీక్షకు అనుమతించాలని విద్యార్థి హరిష్ తండ్రి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో హరీశ్‌పేరు లేదని తన పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు.
పేపర్ లీక్‌లో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, ప్రశ్నపత్రాన్ని బలవంతంగా అతని నుంచి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల పేరుతో తన కుమారుడిని బలి చేయొద్దని ఆ తండ్రి వేదన వ్యక్తం చేస్తూ మిగిలిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాయడానికి తన కుమారుడిని అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ శనివారం జరిపిన కోర్టు, షెడ్యూల్ ప్రకారం తదుపరి పరీక్షలను రాయడానికి హరీష్‌ను అనుమతించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.