Page Loader
Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "తల్లికి వందనం","అన్నదాత సుఖీభవ" పథకాలపై మరోసారి కీలక ప్రకటన చేశారు. "తల్లికి వందనం" అమలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లే లోపు ఈ పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తల్లుల కృషికి గౌరవంగా, ఈ పథకాన్ని తప్పకుండా అమలు చేసి, రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా, "అన్నదాత సుఖీభవ" పథకం కింద మే నెల నుంచి రైతులకు సాయం అందిస్తామని చెప్పారు. కనీసం రూ. 20,000 అందించే విధంగా తొలి అడుగు వేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మొత్తం మూడు విడతల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.

వివరాలు 

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు

అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. వారి నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.