CM Chandrababu: సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు.. వైద్య ఖర్చులు తగ్గాలన్న సీఎం చంద్రబాబు..
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
సైన్స్‌కు టెక్నాలజీని కలిపితే అద్భుతాలు సాధ్యమవుతాయని తెలిపారు.
2000వ సంవత్సరంలో నెల్లూరులో తొలిసారి హాస్పిటల్ ప్రారంభించిన ఘనత తనకే దక్కిందని గుర్తుచేసుకున్నారు.
గత 25 ఏళ్లలో కిమ్స్ హాస్పిటల్ రూ. 25 వేల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసి, 5000 పడకల సామర్థ్యంతో ఓ గొప్ప హాస్పిటల్ చైన్‌గా ఎదిగిందని ప్రశంసించారు.
ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి వైద్యులు అవగాహన కల్పించాలన్నారు.
వివరాలు
భవిష్యత్తు టెక్నాలజీ ఆధారంగా మారుతుంది
"1995 నుంచే టెక్నాలజీ భవిష్యత్తును మారుస్తుందని చెబుతూనే ఉన్నాను. ఇప్పుడూ అదే నిజమవుతోంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకంగా మారుతుంది. మన ఆస్తి ఎంతన్నది కాదు, మన వద్ద ఎంత డేటా ఉందన్నదే ముఖ్యమవుతుంది" అని పేర్కొన్నారు.
సైన్స్, టెక్నాలజీ కలిస్తే సాధారణ వైద్యులే అత్యాధునిక సర్జరీలు చేయగలుగుతారని చెప్పారు.
వివరాలు
ఆరోగ్య పరిరక్షణలో జీవనశైలి ప్రాముఖ్యం
ఒకప్పుడు ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు మనదేశంలోనే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు.
ప్రజల ఆరోగ్యం జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, రాష్ట్రంలో 90% వ్యాధుల మూల కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రకృతి సముపార్జించిన ఆహారాన్ని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏపీ, సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తుల రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షించారు.
వివరాలు
స్వర్ణాంధ్ర లక్ష్యం - ఆధునిక పాలన
"ఇకమీదట ప్రభుత్వ సేవల కోసం మీరు ఏ కార్యాలయానికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆధునిక పాలన విధానాలను అమలు చేస్తూ స్వర్ణాంధ్ర నిర్మాణాన్ని వికసిత భారతంతో అనుసంధానం చేస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
వివరాలు
మెడికల్ ఖర్చులు తగ్గించాల్సిన అవసరం
అనవసరంగా వైద్యం ఖర్చు పెరిగిపోకూడదని, మెడికల్ బిల్లుల భారంతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య సేవలు సమర్థవంతంగా అందించడమే కాకుండా, సమాజ సేవ కూడా వైద్యుల బాధ్యతగా మారాలని అన్నారు.
అవసరం లేకుండా పేషెంట్లను హాస్పిటల్‌లో ఉంచి అధిక బిల్లులు వసూలు చేసే విధానాన్ని మార్చాలని సూచించారు.
రియల్-టైమ్ మానిటరింగ్ ద్వారా కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే పేషెంట్లను హాస్పిటల్‌కు తరలించే విధానం అమలు చేయాలన్నారు.
వివరాలు
ఆదునిక వైద్య రంగంలో స్కిల్ డెవలప్మెంట్
ప్రభుత్వం వైద్య రంగంలో నైపుణ్యాభివృద్ధి (Skill Development) పెంచేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి వేగంగా సాగుతోందని, 2004 లేదా 2019లో టీడీపీ గెలిచి ఉంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
రూ. 1618 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మించామని, కానీ గత ప్రభుత్వ పాలనలో 900 పడకల ఆసుపత్రికే తాగునీరు అందించలేకపోయారని ఆరోపించారు.
ప్రజాభిప్రాయ సేకరణలో టెక్నాలజీ వాడకం
"రాజుల కాలంలో వారు వేషాలు మార్చుకుని ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేవారు. కానీ, నేడు అందరూ మమ్మల్ని గుర్తుపడతారు, అందువల్ల ఆ అవకాశం లేదు.
అయితే, టెక్నాలజీ సహాయంతో ఎక్కడెక్కడో ఉన్న ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాం" అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.