CM Chandrababu: భూకబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో భూకబ్జాలను అడ్డుకునేందుకు తాజా ప్రభుత్వ విధానాల మేరకు రూపొందించిన భూకబ్జా నిరోధక చట్టానికి తక్షణమే ఆమోదం కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు.
అదేవిధంగా, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సహకారం అందించడంతో పాటు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిధుల మంజూరు కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు.
వివరాలు
జాతీయ రహదారుల అభివృద్ధిపై గడ్కరీతో చర్చ
అంతేకాక, అమరావతి అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్-బందరు పోర్టును కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, ఇంకా పలు జాతీయ రహదారుల అభివృద్ధిపై రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు.
అనంతరం, ఢిల్లీలో తన అధికారిక నివాసమైన 1-జన్‌పథ్‌లో విలేకరులతో మాట్లాడారు.
అమిత్‌షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు.
వివరాలు
భూకబ్జా నిరోధక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించాం: చంద్రబాబు
'గత అయిదేళ్లలో భూకబ్జాలు పెద్ద సమస్యగా మారాయి.ప్రస్తుతం ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పది ఫిర్యాదుల్లోఆరింటి వరకు భూకబ్జాలకు సంబంధించినవే.భూ నిర్వహణలో పారదర్శకత లేకపోవడం,కంప్యూటరీకరణలో అడ్డంకులు ఉండటంతో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చి తమ స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తమ భూములను విక్రయించేందుకు సిద్ధమైతే, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆక్రమించుకున్నారు. ఇంటి పట్టాల పేరుతో కూడా అనేక భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అటవీ భూములు, బంజరు భూములను కూడా ఆక్రమించారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ భూకబ్జా నిరోధక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించాం. దీనికి త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిని కోరాం' అని చంద్రబాబు తెలిపారు.
వివరాలు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు
అంతేగాక,బూట్‌లెగ్గింగ్,డెకాయిట్స్,డ్రగ్ ముఠాలు,గూండాల చర్యలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి అనుమతి కోరారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తి పెరిగిందని, దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో రాష్ట్ర ఆర్థిక విషయాలపై చర్చించామన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించి రాష్ట్రాన్ని కరవు నుంచి విముక్తి కల్పించేందుకు వీలుంటుందని వివరించారు.
పోలవరం ప్రాజెక్టుపై ఈ ఏడాది రూ.5,000 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నామని, తొలి దశ పనులు వచ్చే రెండేళ్లలో పూర్తవుతాయని పేర్కొన్నారు.
వివరాలు
హైదరాబాద్-బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో పలు రహదారి ప్రాజెక్టులపై చర్చించామని, విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.
189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలని కోరామన్నారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అటవీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని,ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారి విస్తరణ చేపట్టాలని కోరగా, గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
అంతేగాక, అమరావతి-వినుకొండ, విశాఖపట్నం-మూలపేట రహదారి పనులను వేగంగా పూర్తిచేయాలని, ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని కోరినట్లు తెలిపారు.
హైదరాబాద్-బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు వివరించారు.