Page Loader
Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌
ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌

Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని,ఈ సమస్యను సరిదిద్దాలని సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో దీపం పథకం,రేషన్ బియ్యం పంపిణీ,ఆర్టీసీ సర్వీసులు,చెత్త నుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.

వివరాలు 

గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు

"ప్రతి శాఖ గాడిన పడాలి.ప్రజలకందించే సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి.ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌పై కేవలం చర్చించడమే కాదు, పొరపాట్లు,తప్పులు జరిగిన చోట సరిదిద్దాలి. అవినీతికి,నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలి. ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తా. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులిస్తాం. వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలి" అని సూచించారు. 'దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సీఎం అధికారులు వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు అందిస్తున్నప్పటికీ వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

వివరాలు 

రేషన్ పంపిణీలో అవినీతి ఉండకూడదు

ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బు ఖాతాకి జమ కావడం లేదని కొంతమంది ఫిర్యాదులొచ్చాయని, దీనికి కారణాలు విశ్లేషించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామాల్లోని 5,859 చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరుపై ఫీడ్‌ బ్యాక్ సేకరించారు. ఇవి మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. 2014-19 మధ్య కాలంలో ఈ కేంద్రాలు ఏర్పడినప్పటికీ, వైకాపా ప్రభుత్వంతో వీటి అమలు స్తంభించింది. ఈ కేంద్రాలను మళ్లీ తిరిగి పనిచేసేలా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

వివరాలు 

పనితీరు మెరుగుపర్చుకోవాలి

రేషన్ సరుకుల పంపిణీలో అధిక ధర తీసుకుంటున్నట్లు లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను ప్రశ్నించారు. రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటింటికీ సరఫరా పై వస్తున్న ఫిర్యాదులపై లోతుగా విచారించాలని ఆదేశించారు. "ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలి. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్‌ బ్యాక్‌ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపర్చుకోవాలి" అని ముఖ్యమంత్రి సూచించారు.